Jayant Chaudhary : కన్వర్ యాత్ర సాగే రూట్లో హాటళ్లు, తినుబండారాల దుకాణాల యజమానుల పేర్లతో నేమ్‌బోర్డులు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ వ్యవహరంపై విపక్షాలు యోగి సర్కార్‌పై విరుచుకుపడుతుండగా తాజాగా ఆర్జేడీ ఎంపీ, కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు.
ఇది సరైన ఆలోచనతో తీసుకున్న నిర్ణయంలా కనిపించడం లేదని, సమాజంలో శాంతి, సామరస్యం దెబ్బతినేలా ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని, కన్వర్ యాత్రకు వెళ్లే ప్రజలు, వారికి సేవలు అందించే వారంతా ఒక్కటేనని వ్యాఖ్యానించారు. తొలినుంచి ఇదే ఒరవడి కొనసాగుతున్నదని, తమకు ఎవరు సేవలు అందిస్తున్నారనేది భక్తులు,యాత్రికులు చూసేవారు కాదని చెప్పారు.
ఇప్పుడు అక్కడి దుకాణదారుల పేర్లు తెలుసుకుని, వారిని గుర్తించడం ఏంటనేది తనకు అర్ధం కావడం లేదని అన్నారు. విపక్షాలు ఈ వ్యవహారంపై ఏం చెబుతున్నాయనే దానితో తనకు సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు కన్వర్ యాత్రకు సంబంధించి నేమ్ ప్లేట్ల అంశాన్ని ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో విపక్షాలు లేవనెత్తాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీ లక్ష్యంగా ఈ అంశంపై విపక్షాలు గట్టిగా తమ వాణిని వినిపించేందుకు సన్నద్ధమవుతున్నాయి.
Read More :
Mechanic Rocky | ‘జెర్సీ’ హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న విశ్వక్సేన్