న్యూఢిల్లీ: ఒక ముఖ్యమంత్రో, ఒక విపక్ష నాయకుడో చైనాను పొగిడితే చాలు.. ఆ నేతపై దేశ ద్రోహి అని, ఆ పార్టీకి చెందినవారంతా దేశ ద్రోహులని బీజేపీ, కేంద్రంలోని మోదీ సర్కారు ముద్ర వేస్తుంది. ప్రజల ముందు వాళ్ల పరపతిని దిగజార్చేలా ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పుడు ఏకంగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రే చైనాపై ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీడియాతో మాట్లాడుతూ.. ‘చైనాలో ఉన్న ఒకే సంతానం విధానం ఉత్తమమైనది’ అని కొనియాడారు. భారత్, చైనా ఆర్థిక పురోగతిని బేరీజు వేస్తూ డ్రాగన్ దేశ అభివృద్ధికి వన్ చైల్డ్ పాలసీయే కారణమని చెప్పారు. ‘నాకు తెలిసి 1978లో చైనా జీడీపీ భారత్ కంటే తక్కువ. 1979లో ఆ దేశం వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది. దీంతో అస్తవ్యస్థంగా పెరిగిన జనాభా నియంత్రణలోకి వచ్చింది.
అదే మన దగ్గర ఇప్పుడు చూసినా చాలా జిల్లాల్లో జననాల రేటు దేశ సగటు కంటే ఎక్కువగా ఉన్నది. చైనాలో ప్రతి నిమిషానికి 10 మంది పుడితే, భారత్లో 30 మంది పుడుతున్నారు’ అని వివరించారు. భారత్లో అసంబద్ధంగా పెరుగుతున్న జనాభా వల్ల నీటి వినియోగం పెరిగి భూగర్భ జలాలు ఏటా 3.5 మీటర్లు తగ్గుతున్నాయని తెలిపారు. బీజేపీ నేత విక్రమ్ రంధవా కూడా చైనా మాదిరి కేంద్రం కఠిన చట్టాలు తీసుకురావాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీజేపీ నేతలే చైనాను ప్రశంసించటంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. బీజేపీ వాళ్లు కాకుండా వేరే పార్టీ వాళ్లు చైనాను శ్లాఘించి ఉంటే ఈపాటికే దేశద్రోహి ముద్ర పడేదని కామెంట్ చేస్తున్నారు. మరో నెటిజన్ ఓ అడుగు ముందుకేసి.. ఇప్పుడు చైనాను కొనియాడిన బీజేపీ నేతలు కూడా దేశద్రోహులే కదా!’ అని కౌంటర్ ఇచ్చారు.