ISL | న్యూఢిల్లీ: బధిరుల కోసం దేశంలో తొలిసారిగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (ఐఎస్ఎల్) టీవీ చానల్, చానల్ 31ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటి వరకు బధిరులకు జాతీయ, ప్రైవేట్ చానళ్లలో రోజుకో వారానికో ఒక గంటో, అరగంటో కేటాయిస్తున్నారు. అయితే ఈ చానల్లో 24 గంటలూ వారికి కార్యక్రమాలు ఉంటాయి.
ప్రధాని ఈ-విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ చానల్‌ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) నిర్వహిస్తుంది. సెంట్రల్, స్టేట్ పాఠ్యాంశాలతో కూడి ఉండే కార్యక్రమాలను బధిరులు వీక్షించవచ్చు. ముఖ్యంగా టీచర్లు, విద్యార్థులు, ప్రత్యేక బోధకులకు ఉపయుక్తంగా ఉంటాయి. ఇందులో కెరీర్ గైడెన్స్, మానసిక ఆరోగ్యం వంటి కార్యక్రమాలు ఉంటాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.