తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 1000 మంది హిందూయేతర మతస్థులు పనిచేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం లేని వారు, సనాతన ధర్మాన్ని పాటించలేని వారు టీటీడీలో ఎలా ఉద్యోగం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ గతంలో అన్యమతస్థులను రిక్రూట్ చేసుకున్నా, ఇంకా ఎందుకు మార్పులు తీసుకురావడం లేదని ఆయన అడిగారు. తిరుపతిలో విలేఖరులతో మాట్లాడుతూ ఆయన ఈ ప్రశ్నలు వేశారు.
టీటీడీ వ్యవస్థలో నిగూఢమైన సమస్యలు ఎన్నో ఉండవచ్చు అని, కానీ ఉద్యోగుల అంశంలో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్న అన్యమత భక్తులు ఆ దేవదేవుడి పట్ల తమ నమ్మకాన్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుందన్నారు. కానీ ఎలా వెయ్యి మంది హిందూయేతరులు టీటీడీలో జాబ్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీటీడీలో పనిచేస్తూ తరుచూ చర్చికి వెళ్తున్న ఓ ఉద్యోగిని ఇటీవల సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. టీటీడీ బోర్డులో ఎంత మంది అన్యమత వ్యక్తులు ఉన్నారో దర్యాప్తు చేపట్టాలని మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.