Jamili Elections | న్యూఢిల్లీ, జూలై 27: జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. దేశమంతా ఒకేసారి (పార్లమెంట్, అసెంబ్లీలకు) ఎన్నికలు నిర్వహించి, లబ్ధి పొందేందుకు తహతహలాడిన మోదీ సర్కార్ దానిపై వెనక్కి తగ్గింది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యపడదని తేల్చిచెప్పింది. పార్లమెంట్లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ గురువారం రాతపూర్వక సమాధానమిచ్చారు.
లా కమిషన్‌కు సిఫారసు…
ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు కనీసం ఐదు ఆర్టికల్స్‌కు సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టికల్-83 (పార్లమెంట్ కాల వ్యవధి), ఆర్టికల్- 85 (లోక్‌సభ రద్దు), ఆర్టికల్-172 (రాష్ట్ర అసెంబ్లీల కాల వ్యవధి), ఆర్టికల్-174 (రాష్ట్ర అసెంబ్లీల రద్దు), ఆర్టికల్-356 (రాష్ట్రపతి పాలన విధింపు) తదితర ఆర్టికల్స్‌ను సవరించాలని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ర్టాల ఏకాభిప్రాయాన్ని పొందాలన్నారు. భారీగా ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు అవసరమవుతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా భారీగా భద్రతా బలగాలను మోహరించడం సాధ్యపడదని తెలిపారు. లా కమిషన్‌కు దీన్ని సిఫారసు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
జన్ విశ్వాస్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు-2003కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 42 చట్టాల్లోని 183 ప్రొవిజన్లను సవరించడం ద్వారా చిన్నచిన్న నేరాలను శిక్ష పరిధి నుంచి తప్పించి సులభతర వ్యాపార నిర్వహణకు దోహదం చేసేలా దీన్ని రూపొందించారు. ఈ బిల్లులో పలు జరిమానాలను పెనాల్టీలుగా మార్చారు. వీటికి కోర్టు విచారణ అవసరం ఉండదు. చాలా నేరాలకు జైలు శిక్షను తొలగించారు. ఉభయ సభల సంయుక్త కమిటీ మార్చిలో లోక్‌సభకు నివేదిక దీనిపై ఇచ్చింది.
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చిత్తశుద్ధి ఏది?
న్యూఢిల్లీ, జూలై 27: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిత్త శుద్ధి కనబరచడం లేదు. దాదాపు అన్ని పార్టీలు బిల్లుపై సానుకూలంగానే స్పందిస్తున్నా.. ఈ బిల్లుపై అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం అవసరమని కేంద్రం గురువారం రాజ్యసభలో వెల్లడించింది. ఒక ప్రశ్నకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లిఖిత పూర్వక సమాధానమిస్తూ రాజ్యాంగానికి సవరణ చేసి ఒక బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకు రావడానికి పార్టీల ఏకాభిప్రాయం అవసరమన్నారు. 2010లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ బిల్లు లోక్‌సభలో కూడా ఆమోదం పొందితే లోక్‌సభ, రాష్ర్టాల అసెంబ్లీల్లో 15 ఏండ్ల పాటు మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ అవుతాయి.