Amit Shah : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయం దిశగా దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకుగాను అధికార కూటమి సుమారు 220 స్థానాల్లో అధిక్యంలో ఉన్నది. దాంతో అధికార కూటమి విజయం దాదాపు ఖాయమైంది. కూటమిలో బీజేపీ సొంతంగా 120 పైగా స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే పార్టీ 60 స్థానాల్లో, అజిత్ పవార్ పార్టీ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
దాంతో ఈసారి సీఎం పదవిని బీజేపీ చేపడుతుందా..? లేదంటే మళ్లీ ఏక్నాథ్ షిండేకే సీఎం పదవి కట్టబెడుతుందా..? అనే చర్చ జరుగుతోంది. ఇదిలావుంటే ‘కూటమిలోని పెద్ద పార్టీయే సీఎం పదవి చేపట్టాలనే రూలేం లేదుగా’ అని సీఎం ఏక్నాథ్ షిండే వ్యాఖ్యానించడం ఆయన మళ్లీ సీఎం పదవిని ఆశిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎం ఖరారు నిర్ణయం సజావుగా సాగుతుందా..? లేదంటే అనూహ్య పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటాయా..? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తమ కూటమిలోని మూడు పార్టీల ముఖ్య నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. మహారాష్ట్ర మాజీ సీఎం, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌కు, మహారాష్ట్ర ప్రస్తుత సీఎం, షిండే వర్గం శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేకు, అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు అమిత్ షా ఫోన్ చేశారు. కలిసికట్టుగా అధికార కూటమిని గెలిపించినందుకు వారికి అభినందనలు తెలియజేశారు.