న్యూఢిల్లీ, ఆగస్టు 20: అరెస్టయి వరుసగా 30 రోజులపాటు కస్టడీలో ఉన్న పక్షంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన వివాదాస్పద బిల్లులతోసహా మూడు బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం విపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల(సవరణ) బిల్లు, జమ్ము కశ్మీరు పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాల సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ బిల్లు ప్రతులను చింపివేసి వాటిని అమిత్ షాపై విసిరారు.
అరెస్టయి 30 రోజులపాటు కస్టడీలో ఉన్న రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు లేక మంత్రులను పదవి నుంచి తొలగించే అసాధారణ అధికారాలను గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కట్టబెట్టే ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆగస్టు 21న(గురువారం) వర్షాకాల సమావేశాలు ముగియనుండగా మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి అనుమతించాలని కోరుతూ మంగళవారం రాత్రి అమిత్ షా లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కి లేఖ రాశారు.
బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఆమోదించిన అంశాలలో భాగం కాని బిల్లును సభలో ప్రవేశపెట్టాలంటే మంత్రి ముందుగా నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. అయితే సమయాభావం కారణంగా ఈ నిబంధనలను సడలించాలని అమిత్ షా తన లేఖలో సెక్రటరీ జనరల్‌ని కోరారు. అంతేగాక సభలో ప్రవేశపెట్టడానికి ముందుగా ఎంపీలకు బిల్లు ప్రతులను అందచేయవలసి ఉంటుంది. ఈ నిబంధనను కూడా సవరించాలని అమిత్ షా కోరారు. సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ మూడు బిల్లులను పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన సంయుక్త కమిటీలకు నివేదించనున్నట్లు హోం మంత్రి సెక్రటరీ జనరల్‌కు తెలియచేశారు. అదే ప్రకారం మూడు బిల్లులను పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంట్ కమిటీకి పంపించారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రవ్నీత్ సింగ్ బిట్టూలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇద్దరు టీఎంసీ మహిళా ఎంపీలపై వారిద్దరూ దౌర్జన్యం చేశారని ఆయన విమర్శించారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయ్యి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవిలోంచి తొలగించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగా, దానిని టీఎంసీ ఎంపీలు నిరసిస్తూ వెల్‌లోకి దూసుకు రాగా, ఎంపీలు శతాబ్ది రాయ్, మిథాలీలను ఈ ఇద్దరు మంత్రులూ తోసివేశారని బెనర్జీ మీడియా సమావేశంలో ఆరోపించారు.