చెన్నై, జూన్ 12: ప్రధాని మోదీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఎటువంటి విద్వేషం ఉన్నదో తెలియదు కానీ.. ఓ తమిళుడు ప్రధాని కావాలన్న ఆయన ఆకాంక్షకు తాను పూర్తి మద్దతునిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆదివారం తమిళనాడులో పర్యటించిన అమిత్‌షా పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో తమిళనాడుకు చెందినవారిని ప్రధానిమంత్రిని చేసేలా కష్టపడాలని పిలుపునిచ్చారు. దీనిపై సోమవారం మెట్టూర్ డ్యాం వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో స్టాలిన్ స్పందిస్తూ..
తమిళనాడు నుంచి ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్రమంత్రి మురుగన్ తప్ప బీజేపీకి చెప్పుకోదగిన నేతలు ఎవరూ లేరని అన్నారు. వారికి మాత్రమే ప్రధాని అయ్యే చాన్స్ ఉంటుందని చెప్పారు. గతంలో కూడా ఇద్దరు సీనియర్ నేతలు కే కామరాజ్, మూపనార్‌లను ప్రధాని పదవి చేపట్టకుండా డీఎంకే అడ్డుకున్నదని అమిత్‌షా ఆ సమావేశంలో ఆరోపించారని తెలిపారు. ఓవైపు ప్రధాని మోదీ పదవిలో ఉండగా తమిళనాడుకు చెంది న వారిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని ఉబలాట పడటం వెనుక అమిత్‌షా ఆంతర్యం ఏ మిటని స్టాలిన్ పరోక్షంగా ప్రశ్నించారు. ప్రధానిగా మోదీ తగిన వ్యక్తి కాదని అమిత్ షా చెప్పదల్చుకున్నారా? అంటూ వ్యాఖ్యానించారు.