New Delhi : కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ కరోనాపై సమీక్ష నిర్వహించారు. ఏపీ, కర్నాటక, కేరళ, తెలంగాణ, లక్షద్వీప్, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యమంత్రులు పాల్గొన్నారు. వర్చువల్ విధానం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్న రాష్ట్రాల్లో మరిన్ని కరోనా పరీక్షలను నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సంజీవని, టెలీ కన్సల్టేషన్, మానిటరింగ్, హోమ్ ఐసోలేషన్ జాగ్రత్తలతో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలపై కూడా సమీక్ష నిర్వహించారు. అలాగే ఇన్ఫెక్షన్ల కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులపై కూడా ఓ కన్నేసి ఉంచాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. టెస్టులు, వ్యాక్సినేషన్ పై అధిక దృష్టిని కేంద్రీకరించాలని, గత అనుభవాల దృష్ట్యా ఇవి అత్యావశ్యకమని నొక్కి చెప్పారు. వీటితో పాటు కేసుల పర్యవేక్షణ కూడా జరగాలని అభిప్రాయపడ్డారు. అలాగే టెలీ కన్సల్టేషన్ కేంద్రాలను కూడా ప్రారంభించాలని, వీటి ద్వారా జిల్లా స్థాయిలోనే తగు సూచనలు ఇచ్చే ఛాన్స్ ఉంటుందని మాండవీయ పేర్కొన్నారు.