JP Nadda : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నద్దా గురువారం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గురువారం ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. జేపీ నద్దా వయసు 65. ఈ నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అనేక రకాల పరీక్షలు నిర్వహించారు. వాటిలో కరోనరీ యాంజియోగ్రఫీ పరీక్ష కూడా ఉంది.
ప్రస్తుతం జేపీ నద్దా ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్డియాలజీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రివర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. గురువారం సాయంత్రం ఆయన ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించాయి. అయితే, ఆయనకు గల అనారోగ్య సమస్యకు సంబంధించిన వివరాల్ని మాత్రం వివరించలేదు. సాధారణంగా గుండె రక్త నాళాల్లో ఏదైనా సమస్య, అడ్డంకి ఉందా అని తెలుసుకునేందుకు వైద్యులు కరోనరీ యాంజియోగ్రఫీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఏదైనా సమస్య తలెత్తితే అవసరమైన శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. జేపీ నద్దా గతంలో బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పని చేశారు.
ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో బీజేపీ జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబిన్ చేపట్టారు. మోదీ క్యాబినెట్లో నద్దా కీలకంగా ఉన్నారు. మోదీ, అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడు. ఇదే సమయంలో పార్టీని జాతీయ స్థాయిలో బలోపేతం చేసిన నేతగానే కాకుండా, వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి తెచ్చిన నాయకుడిగానూ నద్దాకు పేరుంది.