Union Govt : జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేస్తోన్న రెండు గ్రూపులపై కేంద్రం నిషేధం విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం – 1967 ప్రకారం ఆవామీ యాక్షన్ కమిటీ (Awami Action Committee), జమ్మూకశ్మీర్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (Jammu and Kashmir Ittihadul Muslimeen) గ్రూపులను ఐదేళ్లపాటు నిషేధిత సంస్థలుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. అవామీ యాక్షన్ కమిటీ (AAC) కి ఉమర్ ఫరూక్ నేతృత్వం వహిస్తుండగా.. జమ్మూకశ్మీర్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (JKIM) సంస్థను మస్రూర్ అబ్బాస్ అన్సారీ నడిపిస్తున్నాడు.
ఈ రెండు సంస్థలకు చెందిన సభ్యులు జమ్మూకశ్మీర్లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టేలా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారని, భారత వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నంటున్నారని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్లో పేర్కొన్నది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రతకు హాని కలిగించే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వారు పాల్పడుతున్నట్లు తెలిపింది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని ఈ రెండు సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొన్నది.