న్యూఢిల్లీ: పరిపాలనలో పారదర్శకత, మంత్రిత్వ శాఖల పనితీరు మెరుగుపర్చడం కోసం మోదీ సర్కారు అన్ని వర్గాల నుంచి సూచనలను తీసుకోవాలని, ప్రాజెక్టులపై పర్యవేక్షణకు టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తున్నది. ఇందుకోసం 77 మంది ఉన్న కేంద్ర మంత్రిమండలిని 8 బృందాలుగా విభజించారు. ఒక్కో బృందానికి క్యాబినెట్ మంత్రి సమన్వయకర్తగా ఉంటారు. ఈ బృందాలు తమకు కేటాయించిన శాఖల వనరులు సమకూర్చుకోవడం, పథకాల అమలుపై రిటైర్డ్ అధికారుల సూచనలు తీసుకోవడంలాంటివి చేయాల్సి ఉంటుంది. ఆయా శాఖల పనితీరును ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న పోర్టళ్లలో మంత్రుల బృందాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాయి. చింతన్ శివిర్ పేరుతో ప్రధాని మోదీ కొన్ని రోజులుగా కసరత్తు చేసి మంత్రుల బృందాలను విభజించారు. ఐదు సార్లు జరిగిన ఈ సమావేశాలు ఒక్కోటి ఐదు గంటలకు పైగా జరిగాయి. చివరి సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు.