Nirmala Sitharaman | త్వరలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు బడ్జెట్ సెషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న మొదలై.. ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. ఆర్థిక మంత్రి సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మూడో ప్రభుత్వ ప్రాధాన్యాన్ని వెల్లడించనున్నారు. నిర్మలా సీతారామన్ చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.
ఈ నెల 23న వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త రికార్డును సృష్టించనున్నారు. గతంలో మాజీ ప్రధాని మొరాజ్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో వరుసగా ఆరుసార్లు ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ మోదీ ప్రభుత్వంలో వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. మోదీ ప్రభుత్వంలో వరుసగా మూడోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డును నెలకొల్పారు. ఆమె రాజకీయ జీవితంలో ఎన్నో మైలురాళ్లను సాధించారు. 2017లో తొలి మహిళా రక్షణ మంత్రిగా పని చేశారు. అంతకు ముందు ఆమె పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగానూ సేవలందించారు. అరుణ్ జైట్లీ (ఆర్థిక మంత్రి 2014-19) అస్వస్థతకు గురైన సమయంలో 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత సీతారామన్ ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టారు. స్వతంత్ర భారతదేశంలో పూర్తికాలం మహిళా ఆర్థిక మంత్రిగా కొనసాగారు.
అంతకుముందు, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కొద్దికాలం పాటు ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. సీతారామన్ 1959 ఆగస్టు 18న మధురైలో రైల్వేలో పనిచేసిన నారాయణ్ సీతారామన్-సావిత్రి దంపతులకు జన్మించారు. సీతారామన్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) నుంచి ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ అండ్ ఎంఫిల్ చేశారు. 1986లో పరకాల ప్రభాకర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ స్టడీస్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. 2003 నుంచి 2005 వరకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా సేవలందించారు.