న్యూఢిల్లీ, జూన్ 14: లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో జూలై 22న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 3న ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందుకు తీసుకొస్తారని తెలుస్తున్నది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 1న మోదీ సర్కార్ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాజాగా మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఈనెల 12న సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించినట్టు సమాచారం. మరోవైపు సీతారామన్ నేతృత్వంలో ఈనెల 22న ఢిల్లీలో 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని జీఎస్టీ కౌన్సిల్ గురువారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.