ఇంఫాల్: పోలీస్ అవుట్‌పోస్ట్‌పై దుండగులు దాడి చేశారు. రైఫిల్స్, మందుగుండు సామగ్రిని ఎత్తుకెళ్లారు. (Gunmen Loot Rifles) దీంతో అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దుండగుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి కక్మయై ప్రాంతంలోని ఇండియా రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్బీ) అవుట్‌పోస్ట్‌పై సాయుధులైన వ్యక్తులు దాడి చేశారు. పలు వాహనాల్లో వచ్చిన ముష్కరులు అక్కడి పోలీస్ సిబ్బంది నుంచి ఆయుధాలు దోచుకున్నారు. ఆరు ఎస్ఎల్ఆర్, మూడు ఏకే రైఫిల్స్, 270 రౌండ్ల మందుగుండు సామగ్రి, 12 మ్యాగజైన్స్ ఎత్తుకెళ్లారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే అదనపు భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఆయుధాలు దోచుకున్న దుండగుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.