అహ్మదాబాద్ : అమ్మనాన్న చూసిన అబ్బాయి నచ్చలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. భావ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ 22 ఏండ్ల యువతి కాంట్రాక్ట్ నర్సుగా పని చేస్తోంది. అయితే ఇటీవలే ఆమెకు తల్లిదండ్రులు ఓ సంబంధం చూశారు. కానీ ఆ అబ్బాయి యువతికి నచ్చలేదు. తల్లిదండ్రులేమో అతన్నే పెళ్లి చేసుకోవాలని బిడ్డకు చెప్పారు. తీవ్ర ఒత్తిడికి లోనైన నర్సు.. ఆదివారం రాత్రి తాను పని చేస్తున్న ఆస్పత్రిలోని స్టోర్ రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.
ఈ ఘటనను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనకు నచ్చని అబ్బాయితో పెళ్లి చేయాలని నిర్ణయించినందుకు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మృతురాలు సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె ఆత్మహత్యకు పెళ్లి సంబంధం కారణం కాదని, ఇటీవల విడుదలైన ప్రభుత్వ ఉద్యోగ ఫలితాల్లో ఆమె ఉత్తీర్ణత పొందలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై.. ఆ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.