న్యూఢిల్లీ: పట్టణ ప్రాంత భారతీయులు నిరుద్యోగం, ఆర్థిక, రాజకీయ అవినీతిపై ఎక్కువగా కలవరం చెందుతున్నారట. ద్రవ్యోల్బణంపైగా ఆందోళన పడుతున్నారట. ఇప్సోస్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ కీలక విషయాలు బయటపడ్డాయి. ‘వాట్ వర్సీస్ ది వరల్డ్’ పేరిట ఇప్సోస్ సంస్థ ఆన్లైన్ ద్వారా 29 దేశాల పౌరులపై సర్వే నిర్వహించింది. ఆయా దేశాల్లోని సామాజిక, రాజకీయ అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ద్రవ్యోల్బణం ఎక్కువ ఆందోళన కలిగించే అంశంగా ఉన్నదని, ఇది గత నెలతో పోల్చుకొంటే 2 శాతం పెరిగిందని సర్వే తెలిపింది.
ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పేదరికం, సామాజిక అసమానతలు, నిరుద్యోగం, నేరాలు, హింస, ఆర్థిక, రాజకీయ అవినీతి వంటి సమస్యల వలన ప్రశాంతత లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని పేర్కొన్నది. ఇప్పోస్ ఇండియా సీఈవో అమిత్ అదార్కర్ మాట్లాడుతూ కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాలు ఇంకా భారత్‌పై కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇవి ఉద్యోగాలపై ప్రభావంపై చూపుతున్నాయని, అవినీతి, నేరాలు, సామాజిక అసమానతల పెరుగుదలకు దారితీస్తున్నదని వివరించారు. వరదలు, ప్రతికూల వాతావరణ ప్రభావాలు వంటి వాతావరణ మార్పులపై పట్టణవాసులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని అభిప్రాయపడ్డారు.