Bulldozer Craze | చంఢీగఢ్, సెప్టెంబర్ 25: ఎన్నికల వేళ హర్యానాలో జేసీబీలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఇంతవరకు కార్లు, వ్యాన్లు వంటి సంప్రదాయ వాహనాలు వాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడు కొత్తగా జేసీబీలపై ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. వచ్చే నెల 5న జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఇప్పుడు వాటినే ప్రచార రథాలుగా వినియోగిస్తున్నారు.
జేసీబీల ముందున్న బకెట్లలో నేతలు, కార్యకర్తలు జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ, పూలు జల్లుతూ, నృత్యాలు చేస్తూ కనిపిస్తున్నారు. ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో గురుగ్రామ్, ఫరీదాబాద్, నూహ్, మహేంద్రబాగ్ తదితర ప్రాంతాల్లోని రియాల్టీ సెక్టార్‌పై దీని ప్రభావం పడింది. ఇప్పటివరకు జేసీబీకి గంటకు రూ.1000 నుంచి 1500 వసూలు చేశామని, ఈ ఎన్నికల పుణ్యమా అని రాజకీయ పార్టీలు గంటకు రూ.5 వేలు చెల్లిస్తున్నాయని గురుగ్రామ్‌కు చెందిన జేసీబీ యజమాని ఒకరు తెలిపారు.
దేశమంతా ఇటీవల కాలంగా బుల్డోజర్ క్రేజ్ పెరిగింది. తొలుత యూపీలో మొదలైన ఈ బుల్డోజర్ సంస్కృతి ఇప్పుడు దేశంలోని పలు రాష్ర్టాలకు పాకింది. దీంతో బుల్డోజర్లకు ప్రతీకగా ఉండే జేసీబీల వెంట రాజకీయ నేతలు పడుతున్నారు. వాటిని చూడటానికి జనాలు ఎగబడుతున్నారు. బహిరంగ సభలు ముగిసిన తర్వాత అక్కడ పార్కు చేసి ఉన్న జేసీబీల వద్ద సెల్ఫీల కోసం జనం వేలం వెర్రిగా క్యూలు కడుతున్నారు.