లక్నో: ఒక నిరుద్యోగ కూలీకి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నుంచి నోటీసులు అందాయి. అతడికి చెందిన రెండు కంపెనీలలో కోట్లలో టర్నోవర్ జరిగిందని, ఈ లావాదేవీలకు సంబంధించి లక్షల్లో జీఎస్టీ చెల్లించాల్సి ఉందని రెండు నోటీసుల్లో (GST Notices) పేర్కొన్నారు. దీంతో భయాందోళన చెందిన ఆ వ్యక్తి సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నరౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయగర్హి బంగర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల దేవేంద్ర కుమార్ ప్రస్తుతం నిరుద్యోగి. రెండేళ్ల కిందట నోయిడాలోని ఒక సాఫ్ట్వేర్ సంస్థలో కార్మికుడిగా పని చేశాడు. రోజుకు రూ.300 కూలీగా వచ్చేది.
అయితే ఈ ఏడాది మార్చి 13న ఘజియాబాద్ ఐటీ ఆఫీస్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఆయనకు చెందిన జేకే ట్రేడర్స్ 2022-23లో రూ.136 లక్షల టర్నోవర్ చేసిందని, దీనికిగాను రూ.24.61 లక్షలు జీఎస్టీ చెల్లించాలని అందులో పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్ 4న అలీఘఢ్‌లోని రాష్ట్ర పన్నుల కార్యాలయం నుంచి మరో నోటీస్ వచ్చింది. దేవేంద్ర కుమార్‌ను సర్వశ్రీ జేకే ట్రేడర్స్ ఓనర్ అని పేర్కొన్నారు. 2022 ఐటీ రిటర్న్స్‌లో రూ.116.24 లక్షల మేరకు పలు రకాల స్క్రాప్ వస్తువులను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి జీఎస్టీని ఎగ్గొట్టినట్లు ఆరోపించారు.
కాగా, జీఎస్టీ నోటీసులు అందుకున్న రోజువారీ కూలీ దేవేంద్ర కుమార్, వాటిని చూసి షాక్ అయ్యాడు. నోటీసుల్లో పేర్కొన్న జీఎస్టీ నంబర్, ఘజియాబాద్ నివాసి జితేంద్ర సిసోడియాకు చెందినదిగా తెలుసుకున్నాడు. అతడికి, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. గతంలో ఆ వ్యక్తికి చెందిన సాఫ్ట్వేర్ సంస్థలో కార్మికుడిగా పని చేసినప్పుడు తన నుంచి ఆధార్, పాన్ కార్డు వంటివి తీసుకున్నారని, వాటిని దుర్వినియోగం చేసి తన పేరుతో రెండు సంస్థలున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించాడు. దీనిపై గౌతమ బుద్ధ జిల్లాలోని సెక్టార్-63 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మరోవైపు అధికారులు తనను ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిప్పుతున్నారని దేవేంద్ర కుమార్ విమర్శించాడు. ఘజియాబాద్ నుంచి నోయిడా, అక్కడి నుంచి బులంద్‌షహర్‌కు వెళ్లడానికి ఇప్పటికే సుమారు రూ.50,000 ఖర్చు చేసినట్లు వాపోయాడు. చీటింగ్, ఫోర్జరీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించాడు.