న్యూఢిల్లీ, జనవరి 2 : కార్మికుల రోజువారీ పని గంటలను ఖరారు చేసే నిర్ణయాన్ని కొత్త కార్మిక కోడ్ల ముసాయిదా నిబంధనలు రాష్ర్టాలకే వదిలివేయడంతో ప్రైవేట్ యాజమాన్యాలు కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేసే అవకాశం ఉందంటూ ఆర్థికవేత్తలు, కార్మికుల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019లో ఆమోదించిన నాలుగు కార్మిక చట్టాలకు సంబంధించిన నూతన ముసాయిదా నిబంధనలను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసి వాటిపైన అభిప్రాయాలను కోరింది. 2020లో విడుదల చేసిన ముసాయిదా నిబంధనలను కార్మిక సంఘాలు అడ్డుకోవడంతో ప్రభుత్వం కొత్తగా వీటిని మరోసారి విడుదల చేయాల్సి వచ్చింది. వేతనాల చట్టానికి చెందిన కొత్త ముసాయిదా నిబంధనలు గత ముసాయిదా నిబంధనల కన్నా అధ్వానంగా ఉన్నాయని విమర్శకులు వ్యాఖ్యానించారు.
1948 నాటి కనీస వేతనాల చట్టం మాదిరిగానే పాత ముసాయిదా నిబంధనలు కూడా ఒక గంట విరామంతో రోజుకు 9 గంటల పని దినాలను నిర్దేశించాయి. అయితే అంతర్జాతీయ కార్మిక సంఘాలు నిర్దేశించిన నిబంధనలకు లోబడి వారానికి 48 పనిగంటల చొప్పున, రోజుకు 8 గంటల పనిదినాలను భారత్ అంగీకరించింది. అయితే కొత్త ముసాయిదా నిబంధనలు రోజువారీ పని గంటల పరిమితిని నిర్దేశించలేదు. దీన్ని రాష్ర్టాలకే(కార్మిక రంగం ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి) కేంద్రం వదిలిపెట్టింది. పని గంటలను నిర్దేశించని కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేయాలని ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉందని కార్మిక సంఘాల ప్రతినిధులు, ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లను మరింత శ్రమద్రోపిడీకి గురిచేయగలదని వారు తెలిపారు. గతంలో మాదిరిగానే వారానికి 48 పనిగంటలను కొత్త ముసాయిదా నిర్దేశించినప్పటికీ రోజుకు ఎన్ని పనిగంటలు ఉండాలో చెప్పకపోవడం వల్ల రోజుకు 12 గంటల చొప్పున వారానికి నాలుగు రోజులు పనిచేయించుకునే ప్రమాదం ఉందని వారు తెలిపారు. ఫుడ్ డెలివరీ ఏజెంట్లను, క్లీనర్లను లేదా క్షురకులను పనుల నిమిత్తం ఇళ్లకు పంపే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు రోజుకు ఎక్కువ పని గంటలు చేయించుకున్న పక్షంలో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని నిపుణులు వాదిస్తున్నారు. ఫ్యాక్టరీల్లో వారం వారీ లేదా నెలవారీ వేతనాలు తీసుకునే కార్మికుల చేత ఓవర్‌టైమ్ పేమెంట్ లేకుండానే రోజులో ఎక్కువ గంటలు పనిచేయించుకుని వారానికి 48 గంటల నిబంధనలకు లోబడి ఇతర రోజుల్లో అదనంగా విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉందని వారు వాదించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా ఉన్న రోజుకు 8 గంటల పని విధానాన్ని కార్మిక మంత్రిత్వశాఖ స్పష్టంగా ప్రస్తావించి ఉండాల్సిందని గుర్గావ్లోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్, కార్మిక ఆర్థికవేత్త శ్యాం సుందర్ తెలిపారు. వారానికి 48 గంటల పనిగంటలను కేంద్రం పేర్కొన్నప్పటికీ రోజుకు ఎన్ని పనిగంటలో నిర్దేశించకపోవడం వల్ల దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉపయోగించుకుని కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.