ముంబై: పిల్లలను చదివించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఐదేళ్ల కుమార్తెతో కలిసి మహిళ బావిలోకి దూకింది. (woman ends life with daughter) మరో కుమారుడ్ని కూడా వెంట తీసుకెళ్లేందుకు ఆమె ప్రయత్నించింది. అయితే ఆమెతో వెళ్లేందుకు నిరాకరించిన ఆ బాలుడు బతికిపోయాడు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాలెగావ్‌కు చెందిన 26 ఏళ్ల భాగ్యశ్రీ భర్తకు ఎకరంన్నర పొలం ఉంది. మేకల పెంపకంపై ఆ కుటుంబం జీవిస్తున్నది.
కాగా, తన కొడుకు, కుమార్తెను సీబీఎస్ఈ అనుబంధ స్కూల్లో చదివించాలని భాగ్యశ్రీ భావించింది. అయితే అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో కొన్ని రోజులుగా దీని గురించి దిగులుగా ఉంది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఐదేళ్ల కుమార్తెతో కలిసి వేరే రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. భర్త వెంకట్‌కు వీడియో కాల్ చేసింది. చివరిసారి కుమార్తెను చూడాలని చెప్పింది. ఆ తర్వాత చిన్నారితో కలిసి బావిలోకి దూకింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహాయంతో భాగ్యశ్రీ, ఐదేళ్ల కూతురు సమీక్ష మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. పిల్లల చదువు విషయంతోపాటు గతేడాది తల్లిని కోల్పోవడం కూడా ఆమె డిప్రెషన్‌కు కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడ్ని కూడా బావి వద్దకు తీసుకెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా అతడు తప్పించుకున్నాడని పోలీసులకు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.