న్యూఢిల్లీ: ఇండియన్ నర్సులు, డాక్టర్లు, ఐటీ ప్రొఫెషనల్స్‌కు బ్రిటన్ వీసాలు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి బ్రిటన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన సమాచారం ప్రకారం వీసా అప్రూవల్స్ భారీగా తగ్గిపోయాయి. హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసాలు 67 శాతం మేరకు తగ్గిపోయాయి. నర్సింగ్ వీసాలు 79 శాతం, ఐటీ సంబంధిత వర్క్ వీసాలు 20 శాతం మేరకు తగ్గిపోయాయి. దీనినిబట్టి విధానపరమైన మార్పుల ప్రభావం స్పష్టమవుతున్నది. నికర వలసలను తగ్గించడం, విదేశీ వర్కర్లపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా లేబర్ గవర్నమెంట్ పని చేస్తున్నది.
ముఖ్యంగా అత్యధిక జీతాలు గల ఉద్యోగాల్లో విదేశీయులను తగ్గించడంపై దృష్టి పెట్టింది. బ్రిటన్ దవాఖానల్లో సిబ్బంది కొరత కనిపిస్తున్నప్పటికీ, విదేశీయుల నియామకాలు మందగించాయి. ఇండియన్ నర్సుల పరిస్థితి అస్పష్టంగా ఉంది. డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రవేశ మార్గాలు ఇరుకుగా కనిపిస్తున్నాయి. కొందరు స్వదేశానికి తిరిగి రావాలని అనుకుంటున్నారు. మరికొందరు కెనడా, ఆస్ట్రేలియావైపు చూస్తున్నారు. ఐటీలోని మిడ్ లెవెల్ రోల్స్ గతంలో స్కిల్డ్ వర్కర్ వీసా పరిధిలో ఉండేవి. వేతన పరిమితులు పెరిగాయి, ఇమిగ్రేషన్ స్కిల్స్ చార్జిని 30 శాతానికి పైగా పెంచడంతో యాజమాన్యాలు అధికంగా చెల్లించవలసి వస్తున్నది.