న్యూఢిల్లీ, ఆగస్టు 8 : దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీగా అందజేయడానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.12 వేల కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. దేశంలోని పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్‌తో పాటు గ్యాస్ సబ్సిడీ అందజేసే ఈ పథకాన్ని 2016లో కేంద్రం ప్రవేశపెట్టింది. కాగా, గత 15 నెలలుగా తక్కువ ధరకు అమ్మే ఎల్పీజీ సిలిండర్ల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆయిల్ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్లకు రూ.30 వేల కోట్ల ఎల్పీజీ సబ్సిడీని ఆమోదించింది.
ఈ మొత్తాన్ని 12 విడతలుగా చెల్లించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. సాంకేతిక విద్యలో బహుళ విభాగ విద్యా పరిశోధన మెరుగుదల (ఎంఈఆర్ఐటీఈ) పథకం అమలు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 275 సాంకేతిక విద్యా సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. అందులో 175 ఇంజినీరింగ్, 100 పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం కింద 2025-26 నుంచి 2029-30 కాలానికి 4,200 కోట్లను అందజేయనున్నట్టు వివరించారు.