న్యూఢిల్లీ, జనవరి 13: యూజీసీ-నెట్ డిసెంబర్ 2024 షెడ్యూల్లో భాగంగా జరుగుతున్న నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 3న ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి 16వ తేదీ వరకు జరగనున్నాయి.
అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నెల 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఎన్టీఏ సోమవారం వెల్లడించింది. ఈ పరీక్ష నిర్వహించనున్న తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. జనవరి 16న జరగాల్సిన పరీక్ష మాత్రం యధావిధిగా అదే రోజున జరగనున్నట్టు ప్రకటించింది.