చెన్నై: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించిన కొత్త ముసాయిదా నియమాలు (UGC Draft Rules) సమాఖ్యవాదంపై దాడి అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. దీనిని వ్యతిరేకించే తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో గురువారం ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం స్టాలిన్, కేంద్ర ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డారు. ‘యూజీసీ ముసాయిదా నియమాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని ఈ అసెంబ్లీ భావిస్తోంది. ఈ నిబంధనలు సమాఖ్యవాదంపై దాడి. తమిళనాడు ఉన్నత విద్యా వ్యవస్థను ఇవి ప్రభావితం చేస్తాయి’ అని అన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) సీఎం ఎంకే స్టాలిన్ తప్పుపట్టారు. విద్యా వ్యవస్థను పాడు చేయడానికి ఈ కొత్త విద్యా విధానాన్ని విధిస్తున్నారని విమర్శించారు. అలాగే నీట్ పరీక్ష లోపభూరితమైందని ఆయన ఆరోపించారు. నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేక ఎంతో మంది అభ్యర్థులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.