Udhayanidhi Stalin : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారనే వార్తలు కేవలం వదంతులేనని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తోసిపుచ్చారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. స్టాలిన్ అమెరికా పర్యటనకు వెళ్లే ముందు ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తామనే సంకేతాలు పంపారు.
ఆపై తమిళనాడు మంత్రి రాజకన్పప్పన్ సైతం ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎంగా అభివర్ణించారు. దీంతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉదయనిధికి కీలక పదవి కట్టబెడతారనే వార్తలు ఊపందుకున్నాయి. కాగా, తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) నియామకానికి సంబంధించిన వార్తలపై ఏఐఏడీఎంకే స్పందించింది. ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎంగా చేస్తే తమిళనాడులో డీఎంకే శకం అంతమవుతుందనే సంకేతాలు పంపినట్టేనని ఏఐఏడీఎంకే ప్రతినిధి కోవై సత్యన్ పేర్కొన్నారు.
2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి డీఎంకే వివిధ వర్గాలుగా చీలుతుందని, ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒకరిద్దరు సీనియర్ నేతలు తిరుగుబాటు బావుటా ఎగరేస్తారని ఆయన జోస్యం చెప్పారు.ఎన్నికలకు ముందు తన కుమారుడు కానీ అల్లుడు కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం లేదని అప్పట్లో ఎంకే స్టాలిన్ (MK Stalin) చెప్పిన విషయాన్ని సత్యన్ గుర్తుచేశారు. ఆపై తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేశారని, ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఉదయనిధి స్టాలిన్‌ను సీఎం అభ్యర్ధిగా ముందుకు తెచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని ఏఐఏడీఎంకే నేత పేర్కొన్నారు.
Read More :
Govt Schools | చాక్‌పీసులకూ డబ్బుల్లేవ్..! రాష్ట్రంలో గాడి తప్పిన పాఠశాలల నిర్వహణ