Udhayanidhi Stalin : హిందీ భాష అనేక ప్రాంతీయ భాషల్ని కబళించింది అని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న మూడు భాషల విధానాన్ని తాము అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. తమిళనాడులో మాతృభాషా అమరుల దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 1960లలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హిందీని బలవంతంగా అమలు చేయాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన తప్పుబట్టారు. దీన్ని అడ్డుకుంటామన్నారు. ‘‘హిందీ భాష.. అనేక ప్రాంతీయ భాషల్ని లేకుండా చేసింది. హర్యాన్వి, భోజ్‌పురి, బిహారీ, ఛత్తీస్‌ఘడీ వంటి భాషలు కనుమరుగయ్యేందుకు ప్రధాన కారణం హిందీ. బలవంతంగా హిందీని అమలు చేయడం వల్ల అనేక భాషలు అంతమవుతున్నాయి. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ భాష కనుమరుగువుతోంది. తమ మాతృభాషల్ని జనం మర్చిపోతున్నారు. హరియాణాలో హరియాన్వి, చత్తీస్‌ఘడ్‌లో ఛత్తీస్‌ఘడీ, యూపీలో భోజ్‌పురి, బిహార్‌లో బిహారీ మాతృభాషలుగా ఉండేవి. హిందీవల్ల అవన్నీ పోయాయి. అందుకే మన సీఎం హిందీ భాష అమలును వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికీ మన మాతృభాషనే మాట్లాడుతున్నాం. హిందీని బలవంతంగా అమలు చేసేందుకే విద్యారంగంలో మూడు భాషల విధానాన్ని కేంద్రం అమలు చేస్తోంది.
తమిళ భాషను, సంస్కృతిని అమలు చేసేందుకే ఇక్కడ రెండు భాషల విధానాన్ని అమలు చేస్తున్నాం. విద్య, పరిశ్రమలు, ఆరోగ్యం, ఇతర రంగాల్లో తమిళం, ఇంగ్లీష్ మాత్రమే అమలు చేస్తూనే ప్రగతి సాధిస్తున్నాం’’ అని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. మరికొద్ది రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.