Uddhav Vs Shinde | మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ సంక్షోభంపై ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray), ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (CM Eknath Shinde) దాఖలు చేసిన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు (Supreme Court) రాజ్యాంగ ధర్మాసనం విచారణను ముగించింది. ఆయా పిటిషన్లపై తీర్పును రిజర్వు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే, షిండేతో పాటు గర్నవర్ కార్యాలయం వాదనలను సుప్రీంకోర్టు విన్నది. థాక్రే తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, దేవదత్ కామత్, అమిత్ ఆనంద్ తివారీ వాదనలను వినిపించారు. సీఎం ఏక్నాథ్ షిండే తరఫున సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ కౌల్, హరీశ్ సాల్వే, మహేశ్ జెఠ్మలానీ, న్యాయవాది అభికల్ప్ ప్రతాప్ సింగ్ వాదించారు. గవర్నర్ కార్యాలయం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత వాదనలు వినిపించారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అన్నిపక్షాల వాదనలు విని.. తీర్పును రిజర్వ్ చేసింది.
గతేడాది జూన్‌లో మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అగాది ప్రభుత్వంపై శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అప్పటి గవర్నర్ కోశ్యారి అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఉద్ధవ్ ప్రభుత్వానికి సూచించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో గవర్నర్ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. దాంతో ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఏక్నాథ్ షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా గవర్నర్ ఉత్తర్వులను రద్దు చేయాలని థాకరే కోర్టును కోరారు. లేదంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని థాకరే వర్గం తరఫున కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
శివసేన ఎమ్మెల్యేల మధ్య విభేదాల కారణంగా ఫ్లోర్ టెస్ట్‌కు ఆదేశించిన గవర్నర్ కోశ్యారి ప్రవర్తనపై సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీల్లో అంతర్గత కలహాలు ఉన్నప్పడు గవర్నర్ తన అధికారాలు వినియోగించే విషయంలో విచక్షణతో వ్యవహరించాలని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. విశ్వాస పరీక్ష ఆదేశిస్తే ప్రభుత్వం పడిపోయే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ప్రభుత్వం పడిపోవడానికి దారితీసే ఎలాంటి చర్యలకైనా గవర్నర్ దిగకూడదని చురకలంటించింది. అంతర్గత కలహాలు చెలరేగితే వెంటనే బలపరీక్షకు ఆదేశించవద్దని, ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు సూచించింది. అధికార పార్టీలో కలహాలు ఉంటే ప్రభుత్వం పడిపోతుందన్న అపోహలో గవర్నర్ ఉండొద్దని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం కుప్పకూలే చర్యలకు గవర్నర్ పాల్పడొద్దని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిదికాదని సుప్రీంకోర్టు కోర్టు పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.