Uddhav Shiv Sena | పూంచ్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి ఘటనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఉద్ధవ్ ఠాకే వర్గం మండిపడింది. బీజేపీకి రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసునని ఆరోపించింది. సైనికులు వీరమరణం పొందుతున్నా రాజకీయాలను మానడం లేదని విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉంటే.. అవకాశాన్ని ఉగ్రవాదులు వాడుకున్నారని ఆరోపించింది.
ఈ మేరకు శివసేన మౌత్ పీస్ సామ్నా కథనం ప్రచురించింది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత సైతం కశ్మీర్ లోయలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయని సామ్నా పేర్కొంది. లోయలో ఇప్పటికీ శాంతి లేదని తెలిపింది. ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి రాజకీయాల్లో బిజీగా ఉన్నారంటూ విమర్శించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలనుద్దేశించి సామ్నా ఆరోపించింది. ప్రధాని పాక్‌తో యుద్ధ భాష మాట్లాడుతున్నారని, అయితే చైనా విషయానికి వస్తే మాత్రం గౌతమబుద్ధుని శాంతి బోధనలు గుర్తుకు వస్తున్నాయని సంపాదకీయంలో సెటైర్లు వేసింది.
దేశంలో బలమైన ప్రధాని, హోంమంత్రి ఉండి ఉగ్రవాదులు దాడికి తెగించారంటూ.. కేంద్ర సంస్థల మోదీ షాల ఆయుధమని, వాటికి ఉగ్రవాదులు భయపడుతారా? అంటూ ఎద్దేవా చేసింది. పూంచ్‌లో గురువారం సైనిక వాహనంపై దాడి జరగ్గా.. ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఇందులో నలుగురు పంజాబ్‌కు చెందినవారు. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వారికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంతాపం ప్రకటించారు. కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారంతా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం మోహరించిన రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన జవాన్లు.