ముంబై : మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని శివసేన చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఠాక్రే అధికార పీఠం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. శివసేన శ్రేణులు, పార్టీ ఎన్నికల చిహ్నం బాణం గుర్తు తమతోనే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల తలెత్తిన పరిణామాలతో శివసేన పని అయిపోలేదని స్పష్టం చేశారు.
తమ పార్టీ సామాన్యులను ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా తయారు చేసిన విషయం మరువరాదని అన్నారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని బాణం గుర్తు శివసేన ఎన్నికల చిహ్నంగా కొనసాగుతుందని ఠాక్రే స్పష్టం చేశారు. శివసేన నుంచి పార్టీ ఎన్నికల చిహ్నాన్ని ఎవరూ వేరు చేయలేరని అన్నారు. జులై 11న సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు శివసేనకే కాకుండా దేశ ప్రజాస్వామ్య భవితవ్యాన్ని నిర్ధేశిస్తుందని వ్యాఖ్యానించారు.
ఏక్నాథ్ షిండే సహా 16 మంది సేన రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం విచారణను ప్రస్తావిస్తూ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. షిండే గ్రూపుకు చెందిన నూతన పార్టీ విప్‌ను గుర్తిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని ఠాక్రే శిబిరం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మధ్యంతర ఎన్నికలకు డిమాండ్
రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఎన్నికలు జరగనున్నందునే కార్పొరేటర్లు, ఇతర నేతలు శివసేనను వీడి షిండే శిబిరంలో చేరుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేలందరూ పార్టీని వీడినా శివసేన కనుమరుగు కాదని స్పష్టం చేశారు. శివసేన ఉనికికి ఢోకా లేదని పార్టీ ఎక్కడికీ వెళ్లదని ఠాక్రే పేర్కొన్నారు.