డెహ్రాడూన్, ఫిబ్రవరి 7: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని బీజేపీ సర్కారు మంగళవారమే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిని సెలక్షన్ కమిటీకి పంపాలని విపక్షాలు సూచించాయి. అయితే మూజువాణి ఓటుతో బుధవారం ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉన్నది. అదే జరిగితే.. స్వాతంత్య్రం వచ్చాక మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వంపై ఉమ్మడి చట్టాన్ని చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిపోనున్నది. సహజీవనం బిల్లులో కఠిన నిబంధనలు పొందుపరిచారు. సహజీవనం చేసే వ్యక్తులు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని, సహజీవనాన్ని దాస్తే ఆర్నెల్ల వరకూ జైలు శిక్ష తప్పదని బిల్లులో ప్రతిపాదించారు.