న్యూఢిల్లీ, జూలై 3: పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయంటూ పదేండ్లు, 15 ఏండ్ల వాహనాలపై విధించిన ఇంధన నిషేధంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తడంతో ఢిల్లీలోని బీజేపీ సర్కారు వెనక్కి తగ్గింది. కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై నిషేధం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. పదేండ్లు దాటిన డీజిల్ వాహనాలకు, 15 ఏండ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనాన్ని నింపవద్దని, జూలై 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అయితే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో, దీనిని వెనక్కి తీసుకుంటున్నట్టు గురువారం ప్రకటించింది. దీనిపై పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ సాంకేతిక సవాళ్లు, సంక్లిష్ట వ్యవస్థల కారణంగా ఇంధన నిషేధం కష్టతరమని అన్నారు. కార్లు, మోటారు సైకిళ్లను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తులను శిక్షించే బదులు, వాహనాలను సరిగా నిర్వహించని వాహనాలను స్వాధీనం చేసుకునే వ్యవస్థను రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు.