Grenade blast : ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలిన ఘటనలో ఇద్దరు భారత జవాన్లు దుర్మరణం పాలయ్యారు. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లోగల కమాల్కోట్ సైనిక శిబిరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అధికారిక వర్గాల కథనం ప్రకారం.. శిబిరంలోని సైనికులు ఆయుధ పరికరాలను ఒకరి నుంచి మరొకరికి అప్పగిస్తున్న సమయంలో గ్రెనేడ్ అకస్మాత్తుగా పేలింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే సైన్యానికి చెందిన 92 బేస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటన పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందని, ఇందులో ఉగ్రవాదుల ప్రమేయం కానీ, ఇతర బాహ్య శక్తుల పాత్రకానీ లేదని రక్షణ శాఖ వర్గాలు స్పష్టంచేశాయి. ఈ దురదృష్టకర సంఘటనపై సైన్యం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. సాధారణంగా ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా జరుగుతాయని, ఆయుధాల వినియోగంలో అప్రమత్తత ఎంతటి కీలకమో ఈ ఉదంతం గుర్తుచేస్తోందని అధికారులు పేర్కొన్నారు. మృతి చెందిన సైనికుల కుటుంబాలకు ఆర్మీ ఉన్నతాధికారులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు అందాల్సిన అన్ని రకాల ఆర్థిక సాయాన్ని, ఇతర ప్రయోజనాలను సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రక్షణ శాఖ అధికారులు హామీ ఇచ్చారు.