న్యూఢిల్లీ, ఆగస్టు 12: మెట్రోపాలిటన్ నగరంలోని ఒక ప్రైవేట్ దవాఖాన గది అద్దె దానికి సమీపంలోని త్రీ-స్టార్ హోటల్ గది అద్దెను మించి ఉండరాదని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ప్రైవేట్ వైద్య ఆరోగ్య సంరక్షణ పొందేటప్పుడు కుటుంబాలు గణనీయమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.
ఆరోగ్య రంగంలో రోగులపై అలవిమాలిన చార్జీలు విధించకుండా పార్లమెంటరీ కమిటీ తన 176వ నివేదికలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి సంబంధించి కొన్ని సిఫార్సులు చేసింది. ప్రైవేట్ దవాఖానల్లో.. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో గదుల అద్దెలను అత్యవసరంగా హేతుబద్ధం చేయాల్సిన అవసరం ఉందని కమిటీ తెలిపింది. కమిటీ తన నివేదికను ఈనెల 8న రాజ్యసభకు సమర్పించింది. ప్రాథమిక గది టారిఫ్‌కు రెసిడెంట్ డాక్టర్, నర్సింగ్, డిస్పోజబుల్ పరికరాలు, ఆహారం, లాండ్రీ చార్జీలను జోడించవచ్చునని కమిటీ పేర్కొంది.