ప్రయాగ్‌రాజ్: భారతీయ వైమానిక దళాని(Indian Air Force)కి చెందిన టూ సీటర్ మైక్రోలైట్ విమానం కుప్పకూలింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆ విమానంలో ఉన్న పైలెట్‌తో పాటు సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. మైక్రోలైట్ విమానాన్ని .. సాధారణంగా శిక్షణ, బర్డ్ రెక్కీ, సర్వే కోసం వినియోగిస్తుంటారు. రెగ్యులర్ సోర్టీలో భాగంగా ఆకాశంలో ఎగురుతున్న సమయంలో విమానం కూలినట్లు అధికారులు చెబుతున్నారు. ఓ చెరువులో అది కూలినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. ఘటన పట్ల దర్యాప్తు మొదలుపెట్టారు.
పప్పామావు, సంగం ప్రాంతాల్లో సోర్టీ నిర్వహిస్తున్నప్పుడు విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు ప్రయాగ్‌రాజ్ డీసీపీ మనీశ్ శాండిలయ్య తెలిపారు. పైలెట్లు సురక్షితంగా బయటకు వచ్చారని, జార్జ్‌టౌన్ పోలీసు ఏరియాలోని కేపీ కాలేజీ వద్ద ఉన్న ఓ చెరువులో ఆ విమానాన్ని దించినట్లు ఆయన చెప్పారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహకారంతో సురక్షితంగా పైలెట్లను రక్షించారు.