Road accident : కేరళలో రెండు ప్రైవేట్ బస్సులు ఒక దానిని ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నామని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించామని వెల్లడించారు.
కోజికోడ్ జిల్లా అథోలి సమీపంలోని కొలియోట్టుతాజామ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగం ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. బస్సులు ఢీకొన్న వేగానికి డ్రైవర్ల క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైందని అన్నారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయని అన్నారు.