Karnataka | బెంగళూరు, డిసెంబర్ 28: కర్ణాటక రాజకీయాలను 2024 సంవత్సరం కుదిపేసింది! ఈ ఏడాది భారీ కుంభకోణాలు వెలుగుచూడటంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. ముఖ్యంగా వాల్మీకి, ముడా కుంభకోణాల్లో అధికార పార్టీ ప్రమేయం స్పష్టంగా వెల్లడైంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యకు ముడా భూముల కుంభకోణంలో పాత్ర ఉందని నిర్ధారణ కావడంతో ఆయనపై కేసు నమోదై, విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక విపక్ష బీజేపీ నేత, మాజీ సీఎం యెడియూరప్పపై పోక్సో కేసు నమోదు కావడంతో పాటు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.
తన మైనర్ కుమార్తెపై యెడియూరప్ప లైంగిక దాడి చేశారని ఒక మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో విపక్ష నేత, జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల విషయానికి వస్తే మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు రాష్ర్టాన్ని కుదిపేసింది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ సర్కార్ తీవ్ర అస్థిరత మధ్య పాలన కొనసాగించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సీఎం పదవికి ఎవరు ఎసరు పెడతారోనని తెలియని అనిశ్చితి పరిస్థితుల్లో సీఎం సిద్ధరామయ్య క్షణమొక యుగంలా పాలన కొనసాగిస్తున్నారు.