న్యూఢిల్లీ, మే 18: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కల్పతి వెంకటరమణ్ విశ్వనాథన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్విట్టర్లో ప్రకటించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన 48 గంటల్లోనే ఈ నియామకాలు జరిగాయి. కొత్త న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్ షా పదవీ విరమణ చేయడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 32కు తగ్గింది. ఇప్పుడు వీరిద్దరి నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య మళ్లీ 34కు పెరిగింది. కాగా, సీనియారిటీ ప్రకారం 2030లో జస్టిస్ వెంకటరమణ్ విశ్వనాథన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్నారు.