న్యూఢిల్లీ: చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ)తో కలిపి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 33 మంది న్యాయమూర్తులు, ఒక సీజేఐ ఉన్నారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ సంఖ్యను మరో నాలుగు పెంచడానికి పార్లమెంటు తదుపరి సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత సీజేఐతో కలిపి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి చేరుతుంది. సుప్రీంకోర్టు(న్యాయమూర్తుల సంఖ్య) చట్టం 1956 ప్రకారం ప్రారంభంలో సీజేఐ మినహా గరిష్టంగా 10 మంది న్యాయమూర్తులు ఉండేవారు. 1960లో ఈ చట్టాన్ని సవరించి న్యాయమూర్తుల సంఖ్యను 13కు పెంచారు. తర్వాత మరొక సవరణ ద్వారా ఈ సంఖ్య 17కు పెరిగింది. 1986లో చట్టాన్ని మరోసారి సవరించి న్యాయమూర్తుల సంఖ్యను 25కు(సీజేఐ కాకుండా) పెంచారు. 2009లో 30కి 2019లో 33కి పెంచారు.