Covid-19 | జార్ఖండ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత రెండురోజుల్లో ఇద్దరికి వైరస్ సోకిందని అధికారులు పేర్కొన్నారు. దాంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య మూడుకు చేరిందని తెలిపారు. రాంచీలో గత రెండు రోజుల్లో రెండు కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయని.. దాంతో పాజిటివ్ రోగుల సంఖ్య మూడుకు చేరిందని రాంచీ సివిల్ సర్జన్ ప్రభాత్ కుమార్ పేర్కొన్నారు. ముంబయి వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలడంతో జార్ఖండ్‌లో తొలి కేసు నమోదైంది. ఈ క్రమంలో అధికారులు కేసులు పెరుగకుండా అడ్వైజరీ చేశారు. ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తే మాస్క్‌లు ధరించాలని సూచించింది. రద్దీ ఉండే ప్రాంతాల్లో అందరూ మాస్క్ ధరించాలని ప్రజలకు సూచించింది.
ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే ఇంట్లోనే ఉండాలని.. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, పరిశుభ్రత పాటించాలని అధికారులు అడ్వైజరీలో కోరారు. అవసరమైనంత నీటిని తీసుకోవాలని.. శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిని పర్యవేక్షిస్తూ ఉండాలని.. వైద్యుడిని సంప్రదించాలని పరిపాలన సూచించింది. వైరస్ లేదంటే ఏదైనా బ్యాక్టీరియా సోకిందని తేలిస్తేనే తప్పా యాంటీబయాటిక్స్ వాడొద్దని చెప్పింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే ఆక్సిజన్ స్థాయి 93శాతం.. అంతకంటే తక్కువ పడిపోకుండా చూడాలని.. ఐదురోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరం, దగ్గు కనిపిస్తే వెంటనే వైద్యుడి సంప్రదించాలని సూచించారు.
60 ఏళ్లు పైబడిన వారు, గుండె జబ్బులు, మధుమేహం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, క్షయ, దీర్ఘకాలిక ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు, ఊబకాయం, టీకాలు తీసుకోని వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని అడ్వైజరీలో సూచించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం భారత్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కేరళతో పాటు ముంబయిలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో అత్యధికంగా కేరళలో 430, మహారాష్ట్రలో 210, కర్నాటకలో 126, ఢిల్లీలో 104 యాక్టివ్ కేసున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.