ఆక్నూర్: జమ్మూ(Jammu and Kashmir) ప్రాంతంలోని ఆక్నూర్ సెక్టార్లో ఓ గ్రామంలో దాచుకున్న ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. మంగళవారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతిచెందాడు. ఆ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నట్లు సమాచారం రావడంతో ఫైరింగ్ జరిపారు. ఇప్పటి వరకు ఆక్నూర్ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. మరో ఉగ్రవాదిని హతమార్చేందుకు భద్రతా దళాలు వేటాడుతున్నాయి. జోగ్వాన్ గ్రామంలో ఉన్న అసన్ ఆలయ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆ ఉగ్రవాది దాచుకున్నట్లు తెలుస్తోంది. నియంత్రణ రేఖ వద్ద తిరుగుతున్న ఆర్మీ కాన్వాయ్‌పై సోమవారం ఉదయం ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఆ వెంటనే భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా దళాలు, ఎన్ఎస్జీ కమాండోలు చేపట్టిన ఆపరేషన్‌లో తొలుత ఓ ఉగ్రవాది మరణించాడు.