న్యూఢిల్లీ, మే 22: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఇద్దరు భారత పర్వతారోహకులు కిందికి దిగుతుండగా మరణించారని ఒక అధికారి శుక్రవారం తెలిపారు. మృతులను అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేగాగా గుర్తించారు. వారిద్దరూ కిందికి దిగుతుండగా అలసిపోయారని, వారిని రక్షించేందుకు గైడ్లు ప్రయత్నించినా సఫలం కాలేదని ఎక్స్పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ ప్రధాన కార్యదర్శి రిషి భండారీ తెలిపారు. ఎవరెస్ట్ శిఖరం నుంచి కిందికి దిగుతుండగా గురువారం సాయంత్రం తివారీ హిల్లరీ స్టెప్ వద్ద కుప్పకూలిపోయారని ఈ పర్వతారోహణ యాత్రను నిర్వహించిన పైనీర్ అడ్వెంచర్స్ డైరెక్టర్ నివేష్ కర్కీ చెప్పారు. దీంతో ఈ సీజన్లో మొత్తం మరణాలు ఐదుకు చేరాయని అన్నారు.