న్యూఢిల్లీ: పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘పులిట్జర్’ పురస్కారం ఈసారి ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్ నిఘా వ్యవస్థలు, సైబర్ మోసాల వెనుకున్న వ్యవహారాలను లోతుగా అధ్యయనం చేసి.. వెలుగులోకి తెచ్చినందుకు ఆర్కే ఆనంద్, సుపర్ణా శర్మలకు ఈ గౌరవాన్ని అందజేస్తున్నట్టు ‘కొలంబియా యూనివర్సిటీ’ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలుస్ట్రేటెడ్ రిపోర్టింగ్, కామెంటరీ విభాగంలో వీరిని ఎంపిక చేసింది. ప్రముఖ మీడియా సంస్థకు చెందిన నటాలీ ఒబికో పియర్సన్తో కలిసి ఈ అవార్డును వారు సంయుక్తంగా అందుకోనున్నారు.
వీరి పరిశోధనాత్మక ప్రాజెక్ట్ ‘ట్రాప్డ్’ పేరుతో ప్రచురితమైంది. భారతదేశంలో ఒక ప్రముఖ న్యూరాలజిస్ట్ ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌కు ఎలా బాధితుడిగా మారారో ఈ కథనం కండ్లకు కట్టినట్టు వివరించింది. జర్నలిజం, సాహిత్యం, సంగీత రంగాల్లో కొలంబియా యూనివర్సిటీ ఏటా పులిట్జర్ అవార్డులను ప్రకటిస్తుంది. పరిశోధనాత్మక రిపోర్టింగ్, పబ్లిక్ సర్వీస్ జర్నలిజంలో అద్భుత ప్రతిభావంతులకు ఈ అవార్డు ఒక గ్లోబల్ బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తారు.