సెహోర్ : మధ్యప్రదేశ్లో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కొత్రి కాలేజీలో చదువుతున్న అయిదుగురు విద్యార్థులు ఆదివారం సాయంత్రం సెహోర్ జిల్లాలోని భెరు కో జలపాతానికి వెళ్లారు. అక్కడ పోలీసులు, జిల్లా యంత్రాంగం పలుమార్లు హెచ్చరించినా వినకుండా ప్రమాదకరమైన ప్రదేశంలో ఇద్దరు విద్యార్థులు సెల్ఫీలు తీసుకొనేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో సిణ్ముక్(20) కాలు జారి నీటిలో పడిపోగా, హేమంత్(20) అతడిని రక్షించడానికి నీటిలోకి దూకాడు. ఆ తర్వాత వారిద్దరూ మునిగిపోయారు. మిగిలిన విద్యార్థులు అందించిన సమాచారం మేరకు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ ఘటనా స్థలికి చేరుకొని వారి కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయం ఇద్దరు విద్యార్థుల మృత దేహాలను వెలికితీశారు.