Cyber Fruad | భోపాల్ పోలీస్ కమిషనర్ పేరిట సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని షకీల్ మహ్మద్, సునిల్ ప్రజాపత్ అని పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఫేస్బుక్ ఫేక్ ప్రొఫైల్స్ సృష్టిస్తున్నారు. వీరిని రాజస్థాన్ లోని అల్వార్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోనూ ఒక జిల్లా ఎస్పీ పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించినందుకు కర్ణాటక పోలీసులకు వీరిద్దరు ‘వాంటెడ్’ ఉన్నారు.
వీరు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన సంగతి ఒక వ్యాపార వేత్త సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే తెలిసింది. భోపాల్ కు చెందిన 45 ఏండ్ల వ్యాపార వేత్త సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ నెల ఐదో తేదీన ఫిర్యాదు చేశారు. భోపాల్ పోలీస్ కమిషనర్ హరి నారాయణ చారి మిశ్రా యూనిఫామ్‌తో కూడిన ఫోటో గల ఫేస్బుక్ ఖాతా నుంచి తనను రూ.45 వేలకు మోసగించారని వ్యాపార వేత్త ఫిర్యాదు చేశారు. తన పాత ఆస్తిని విక్రయించమని భోపాల్ పోలీస్ కమిషనరేట్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. ఇందుకోసం తాను క్యూఆర్ కోడ్ ద్వారా రూ.45 వేలు చెల్లించానని సదరు వ్యాపారవేత్త తెలిపారు.
భోపాల్ సైబర్ క్రైమ్ పోలీసు విభాగం డీసీపీ అఖిల్ పటేల్ స్పందిస్తూ ఈ కేసు తదుపరి దర్యాప్తుపై నిందితులిద్దరిని కస్టడీ కోసం రిమాండ్ చేయాలని కోరతామన్నారు. వారి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు, రూ.5000 నగదు జప్తు చేశామని పోలీసులు తెలిపారు.