ముంబై: ఇద్దరు విద్యార్థినులు స్కూటీపై వెళ్తున్నారు. వేగంగా వచ్చిన రెడీ మిక్స్ కాంక్రీట్ లారీ ఒక మలుపు వద్ద అదుపుతప్పింది. అక్కడ ఆగి ఉన్న విద్యార్థినుల స్కూటీపై ఆ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు యువతులు మరణించారు. (Truck Overturns on Students) ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం పింప్రి చించ్వాడ్లోని ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు స్కూటీపై వెళ్తున్నారు. అయితే హింజావాడి నుంచి మహలుంగేకు వెళ్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ లారీ వేగంగా దూసుకువచ్చింది. హింజావాడి-మాన్ రోడ్డులోని మలుపులో ఆ వాహనాన్ని గమనించిన విద్యార్థిని స్కూటీని పక్కకు తిప్పేందుకు ప్రయత్నించింది. అయితే మలుపులో అదుపుతప్పిన ఆ లారీ ఆ స్కూటీపై బోల్తాపడింది. ఈ నేపథ్యంలో స్కూటీపై ఉన్న ఆ యువతులు రెడీ మిక్స్ కాంక్రీట్ లారీ కింద నలిగి అక్కడికక్కడే మరణించారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్స్ను రప్పించి బోల్తాపడిన కాంక్రీట్ లారీని పైకిలేపారు. దాని కింద నలిగి మరణించిన విద్యార్థినుల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు మృతులను 21 ఏళ్ల ప్రాంజలి యాదవ్, 22 ఏళ్ల ఆశ్లేషా గవాండేగా పోలీసులు గుర్తించారు. వారిద్దరూ ప్రైవేట్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) చివరి సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | #Pune: Two Women Killed As Mixer Truck Overturns On Hinjawadi-Maan Road
Read here: https://t.co/eNxNjcWF8N#punenews #Maharashtra pic.twitter.com/qhoGvE9lVJ
— Free Press Journal (@fpjindia) January 25, 2025