ఇంఫాల్: మణిపూర్‌లో గంట వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. (Earthquakes) అలాగే పలు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 11.06 గంటల సమయంలో తొలుత 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని యైరిపోక్‌కు తూర్పున 44 కిలోమీటర్ల దూరంలో, 110 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు షిల్లాంగ్‌లోని ప్రాంతీయ భూకంప కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల అస్సాం, మేఘాలయాతోపాలు పలు ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని చెప్పారు.
కాగా, గంట తర్వాత మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో 4.1 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. కామ్జోంగ్ జిల్లాలో 66 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మణిపూర్‌లోని పలు భవనాల్లో పగుళ్లు కనిపించినట్లు చెప్పారు.
మరోవైపు తౌబాల్ జిల్లాలోని వాంగ్జింగ్ లామ్డింగ్లో జాతి ఘర్షణల్లో బాధితులైన నిరాశ్రయుల కోసం సహాయ శిబిరం నిర్వహిస్తున్న స్కూల్ బిల్డింగ్ కూడా పగుళ్లిచ్చినట్లు అధికారులు తెలిపారు. గంట వ్యవధిలో సంభవించిన రెండు భూకంపాల వల్ల జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.