Building collapse : పురాతన భవనం కుప్పకూలిన (Building collapse) ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్ (Jaipur) లోని సుభాష్ చౌక్ (Subhash Chowk) ఏరియాలో శనివారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు రెస్క్యూ టీమ్స్‌తో సహా ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం ఏడుగురు క్షతగాత్రులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. కూలిపోయిన భవనంలో మొత్తం 19 మంది అద్దెకు ఉంటున్నారని స్థానికులు తెలిపారు.
భవనం కూలినప్పుడు అందరూ అందులోనే ఉన్నారా..? ఎవరైనా బయట ఉన్నారా..? అనే వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.