న్యూఢిల్లీ, మే 11: భారీ దుమ్ము, ఉరుములతో కూడిన వర్షం కురియడంతో ఢిల్లీలో శుక్రవారం ఇద్దరు మరణించగా, 23 మంది గాయపడ్డారు. వాన, ఈదురు గాలుల కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్లో పలు చోట్ల చెట్లు నేలకూలగా, కొన్ని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 200కు పైగా ఇండ్లు చీకటిలో చిక్కుకున్నాయి.
పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెను గాలుల కారణంగా ఢిల్లీకి వస్తున్న తొమ్మిది విమానాలను జైపూర్‌కు మళ్లించినట్టు అధికారులు తెలిపారు. భవనం మరమ్మతుల నిమిత్తం ఏర్పాటు చేసిన షట్టరింగు కూలి నోయిడాలో పలు కార్లు ధ్వంసమయ్యాయి. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటకలో స్వల్వ వర్షపాతం నమోదు కావచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.