మాండ్యా: గ్రామంలో వానలు పడటంలేదని ఆ గ్రామస్తులంతా కలిసి ఓ విచిత్ర కార్యక్రమం నిర్వహించారు. వాన దేవుళ్లను తృప్తిపర్చడం కోసం గ్రామంలోని ఇద్దరు అబ్బాయిలకు ఉత్తుత్త పెళ్లి జరిపించారు. ఒక అబ్బాయికి పెళ్లి కొడుకు లాగా, మరో అబ్బాయికి పెళ్లి కూతురు లాగా సంప్రదాయబద్దమైన వస్త్రధారణ చేయించారు. నిజం పెళ్లిలాగానే అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఆఖరికి శుక్రవారం రాత్రి వివాహ వేడుకను పూర్తి చేశారు.
కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా క్రిష్ణరాజ్పేట్ తాలూకాలోని గంగెనహళ్లి గ్రామంలో ఈ వింత పెళ్లి జరిగింది. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించిన కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడటంలేదు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం పూర్తిగా ముఖం చాటేసింది. గంగెనహళ్లి గ్రామంలో అదే పరిస్థితి. అందుకే గ్రామస్తులంతా కలిసి ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు.